Thursday, May 02
Breaking News:

అందవెల్లి పెద్దవాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన వర్షానికి కొట్టుకుపోయింది

1693814424_aab.jpg

కొమురం భీమ్ జిల్లా :  కాగజ్ నగర్ మండలంలోని అందవెల్లి పెద్దవాగుపై నిర్మించిన తాత్కాలిక  వంతెన వర్షానికి  కొట్టుకుపోయింది. ఈ వంతెన నిర్మాణం పూర్తి చేసి 24 గంటలు కాకముందే వరదకు కొట్టుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. పెద్దవాగుపై శాశ్వత వంతెన నిర్మాణంలో జాప్యం జరుగుతుండడంతో తాత్కాలికంగా పైపులు, మట్టితో వంతెన నిర్మించారు. ఈ వంతెన నిర్మాణం ఇంజనీరింగ్ అధికారులేం చేస్తున్నారు.. శనివారం సాయంత్రంతో ముగిసింది. ఇంకా రాకపోకలు కూడా ప్రారంభం కాలేదు.  పెద్దవాగులో వచ్చిన వరదకు ఈ తాత్కాలిక వంతెన నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. దీనికి ముందు కూడా ఒకసారి
తాత్కాలిక వంతెన నిర్మించగా, కొద్ది రోజుల తర్వాత కొట్టుకుపోయిన విషయం తెల్సిందే. అప్పట్లో కొన్ని రోజుల పాటు ప్రజలకు సౌకర్యం కలిగింది. కాని ఇప్పుడు మాత్రం ఒకరోజు కూడా పూర్తి కాకముందే వంతెన కొట్టుకుపోవడం గమనార్హం.

కాగా పెద్దవాగులో వరద వస్తే ఈ తాత్కాలిక వంతెన ఆగదని తెలిసీ ఇంజనీరింగ్ అధికారులు దీనిని ఎందుకు నిర్మించారనేది ఇప్పుడు ప్రశ్న ఇంకా వర్షాకాలం పూర్తి కాలేదు. రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయని ఒక పక్క వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయినా అధికారులు ఈ తాత్కాలిక వంతెన ఏర్పాటుకు ఎందుకు తొందరపడ్డారు? నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకు ఈ వంతెన నిర్మాణం చేపట్టినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓట్ల కోసం నాయకులు అధికారులపై పనుల కోసం ఒత్తిడి తేవడం సహజం. వరద వస్తే ఆ వంతెన కొట్టుకుపోతుందని  తెలుసు. కాని పోతే పోనీ ప్రభుత్వ ధనమే కదా అని అనుకున్న  అధికారులు కూడా ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Prev Post బిఆర్ఎస్ పార్టీతోనే...
Next Post మంత్రి మహేందర్ రెడ్డ...

More News